అంద‌రికి మార్గ‌ద‌ర్శ‌కుడు వ్యాసుడు  – శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి
గురువులు, ఆచార్యుల‌కే కాదు స‌మ‌స్త మాన‌వ జాతికి వ్యాస మ‌హ‌ర్షి మార్గ‌ద‌ర్శ‌కుడు అని  శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన్న‌జీయ‌ర్ స్వామి వారు అన్నారు. శంషాబాద్‌లోని దివ్య సాకేత క్షేత్రంలో 9వ తేదీ ఆదివారం రోజున శ్రీ స్వామి వారు చాతుర్మాస్య దీక్ష‌ను స్వీక‌రించారు.  ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భ‌క్త‌కోటిని ఉద్ధేశించి  ప్ర‌సంగించారు.  అన్నింటికి మూలం వేద‌మే. ఆయా కాలాల‌లో ఎంద‌రో మ‌హానుభావులు ఈ నేల‌పై జ‌న్మించారు. వారు త‌మ త‌మ దారుల్లో వీలైనంత మేర ధ‌ర్మాన్ని ఆచ‌రించేలా కృషి చేశారు. అలాంటి వారిలో వాల్మీకి రామాయ‌ణాన్ని అందించారు. జ‌రిగిన‌ది, జ‌ర‌గ‌బోయేది, వ‌ర్త‌మానం గురించి గురువులు గ‌తంలో చెప్పి వున్నారు. వాట‌న్నిటిని ఒక చోటుకు చేర్చి  చ‌రిత్ర‌ను భావి త‌రాల‌కు అందించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. వేదం మొద‌ట ఒక రాశిగా వుండేది. దానిని నాలుగు విభాగాలుగా వ్యాస మ‌హ‌ర్షి విభ‌జించి స‌మాజానికి అందించారు. 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, బ్ర‌హ్మ సూత్రాలు , మ‌హాభార‌తం కూడా అందించారు.
  చంద్రుడి వ‌ల్ల‌నే భూమిలోంచి వ‌చ్చే మొక్క‌లు, ప‌చ్చ‌ద‌నం వ‌స్తోంది. అందుకే చంద్రుడిని ఓష‌ధీప‌తి అంటాం.
సూర్య‌కాంతి తేజ‌స్సు ఇస్తుంది. చంద్ర‌కాంతి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆహారాన్ని అందించేలా చేస్తుంది.   మ‌నుషులు, జంతువులు, ఇత‌ర జీవ‌రాశులకు కావాల్సిన శ‌క్తి, బ‌లం చేకూరుస్తుంది. చంద్రుడి వ‌ల్ల  ప‌క్షులు, ప్రాణ‌కోటి అంతా ప్రాణం పోసుకుంటాయి. సూర్య‌కాంతిలోని తీవ్ర‌త‌ను త‌న‌లోకి చేర్చుకుని చంద్రుడు చ‌ల్ల‌ద‌నాన్ని అంద‌జేస్తాడు. ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌లిగిన గురువే ఆచార్య చంద్రుడిగా కొలుస్తారు.  ఈ సృష్టి చేసే క్ర‌మంలో వేదం అత్యంత ప్రాముఖ్య‌మైన‌ది. స‌మ‌స్త జీవుల్లోని తేజ‌స్సు, పోష‌ణ‌, శ‌క్తి అంతా చంద్రుడి నుంచి వ‌చ్చిందే. భ‌గ‌వంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయ‌నే అన్నీ తానై న‌డిపిస్తాడు. అంతా నిమిత్త‌మాత్రులే. శ్రీ‌కృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ అదే.
ప్ర‌తిఒక్క‌రు ధ‌ర్మాన్ని ఆచ‌రించాలి. తాను బ‌త‌కాలి. ఇత‌రుల్ని బ‌త‌క‌నివ్వాలి. త‌ను తృప్తి చెందాలి. ఇత‌రులు కూడా సంతోషంగా ఉండేలా పాటు ప‌డాలి.  మ‌నం ధ‌ర్మాన్ని ఆచ‌రించేందుకే ఇక్క‌డికి వ‌చ్చామ‌న్న సంగ‌తి గ్ర‌హించాలి.  భావోద్వేగాల‌ను అదుపులో పెట్టుకోవాలి. నేను , నాది అన్న గ‌ర్వాన్ని వీడాలి. అప్పుడే ధ‌ర్మం నిల‌బ‌డుతుంది. త‌న‌కు తృప్తినిచ్చి సాటి వారికి మేలు జ‌రిగేలా చూడ‌ట‌మే ధ‌ర్మం. మ‌నం చేసే ప‌నికి రెండు ముఖాలున్నాయి.
ప్ర‌తిదాంట్లో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించ‌డం భావ్యం కాదు.   జ్ఞానం, అనుభవం రెండూ అవ‌స‌ర‌మే. ఏం చేస్తే ధ‌ర్మ‌బద్దంగా ఉంటుందో దానినే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు తెలిపాయి. అదే శ్రీ‌కృష్ణుడు అర్జునుడికి గీతోప‌దేశం చేశాడు. ఎలా జీవించాలి. ఏది ధ‌ర్మం..ఏది అధ‌ర్మం. ఏది క‌ర్మ‌..ఏది మ‌న స్థాయి ఏమ‌టో తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రు  ఏదో ప‌నిలో నిమ‌గ్నం కావాలి. ప్ర‌తి దానికి ఓ ప్ర‌త్యేక‌త‌, ప్రాధాన్య‌త ఉంటుంది. ఈ లోకంలోకి వ‌చ్చిన వాళ్ల‌మంతా ఏదో ఒక దానిలో లీన‌మై పోవాలి. ఏ దేశంలో ఉన్నా ఏ కాలంలో జీవిస్తున్నా చేయాల్సిన క‌ర్త‌వ్యాలు, బాధ్య‌త‌లు అనేవి కొన్ని ఉంటాయి. తెలుసుకుని చేస్తే ధ‌ర్మం. తెలియ‌క చేస్తే అది ఖ‌ర్మ‌. భారం పెరుగుతుంది. దీని వ‌ల్ల‌. ఏది సుఖం ఏది దుఖఃం అనేది మ‌నం చేసే దానిని బ‌ట్టే తెలుస్తుంది. అందుకే ప‌ని చేస్తూనే వుంటే ఫ‌లితం దానంత‌ట అదే వ‌స్తుంది. దాని వెనుక న‌డిపించే శ‌క్తి అనేది ఒక‌టంటూ వుంది. అదే దేవుడు. పైన ఆయ‌న వున్నాడు. మ‌నమంతా ఆయ‌నకు చెందిన వాళ్లం.
చేసే ప‌నుల్లో కొంద‌రు నేను నాది అనే గ‌ర్వం క‌లిగి వుంటారు. నేను చేస్తున్నాను అంటే అహంకారం. ఈ ప‌ని నా వ‌ల్లే జ‌రుగుతుంది అంటే గ‌ర్వం. ప‌ని చేశాక ఫ‌లితం నాకే ద‌క్కాలి అనుకోవ‌డం నాశ‌నం. ఇదే ఫ‌లాకాంక్ష‌. ఈ మూడు మ‌నిషి జీవితంలో ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి. అందుకే వీటిని వ‌దిలి వేయాలి. అప్పుడు ఆనందం మ‌న స్వంత‌మవుతుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పై మూడింటిని వ‌దులు కోవ‌డం కొంత క‌ష్ట‌మే . ధ‌ర్మం కోస‌మేగా మ‌నం ఇక్క‌డున్న‌ది. దానిని కాపాడేందుకే క‌దా ఇక్క‌డికి వ‌చ్చింది. ప్ర‌తి దానిలో..ప్ర‌తి ఒక్క‌రిలో దేవుడున్నాడు. ఆయ‌న మ‌న వెనుక వుండి చేయిస్తున్నాడు. అదే బ‌లం..అదే శ‌క్తి. అదే ఇప్ప‌టిదాకా ఇంత‌దాకా న‌డిపిస్తోంది. ఆ అనుభ‌వం ఆచ‌ర‌ణాత్మ‌క‌మైన‌ది. నా మీద భారం పెట్టండి. ఈ జీవితం దేవుడికే చెందాలి. ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చే ఏ ఫ‌లిత‌మైనా ఆయ‌నకే అర్పించాలి..
తీక్ష‌ణ‌మైన సూర్య‌కాంతిని గ్ర‌హించి చంద్రుడు మ‌న‌కు చ‌ల్ల‌ని, ఆహ్లాద‌క‌ర‌మైన‌ వెన్నెల‌ను కురిపిస్తున్నాడు. అలాగే క్లిష్ట‌మైన శాస్త్ర జ్ఞానాన్ని గ్ర‌హించి సామాన్యుల‌కు అర్థ‌మ‌య్యేలా అమృత‌తుల్యంగా అందించే వాడే ఆచార్య చంద్రుడు.  గురువు ద్వారా వ‌స్తేనే జ్ఞానం ల‌భిస్తుంది. చ‌దువు అబ్బుతుంది. ధ‌ర్మ సంస్థాప‌నాయ సంభ‌వామి యుగే యుగే అన్నాడు శ్రీ‌కృష్ణుడు. ఏ ప‌ని నువ్వు చేసినా ఆ ప‌ని ఫ‌లితం భ‌గ‌వంతుని దాకా చేర‌వేసే బాధ్య‌త  గురువు  చేయాలి.  6 వేల సంవ‌త్స‌రాల కింద‌ట వేద వ్యాసుడు చేసిన మ‌హాప్ర‌య‌త్న‌మే ఈ వేదాలు. అందుకే ఆయ‌న ఆది గురువుగా ప్ర‌సిద్ధి చెందారు.
గురువుకు గుర్తింపు రావాలంటే వ్యాసుడిని అనుస‌రించాలి. ఆచార్యుల ప‌రంప‌ర నేటికీ కొన‌సాగుతూనే వుంది. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా పాయ‌లుగా చీలి పోయినా అంద‌రిది ఒక‌టే ధ‌ర్మం. ఒకే గ‌మ్యం. ధ‌ర్మాన్ని ఆచ‌రించేలా చేయ‌డం. దానిని కాపాడ‌టం. స‌మాజ హితం కోసం కృషి చేయ‌డం. గురువుల‌కు వ్యాసుడే మార్గ‌ద‌ర్శి. స్ఫూర్తి కూడా. ఇవాల్టీకీ పొందిన జ్ఞాన‌మంతా బాద‌రాయ‌ణ మ‌హ‌ర్షిదే. వైదిక ప్రాప్తిని శంక‌రాచార్యులు, సామాజిక చైత‌న్యాన్ని క‌లిగించిన‌ శ్రీ రామానుజులు, మ‌ధ్వాచార్యులు..వారి శిష్యులు..అనుచ‌రులు ఈ ప్ర‌పంచానికి ఎంతో చేశారు. ఆ మ‌హ‌నీయులు న‌డిచిన దారుల్లోనే మ‌న‌మంతా న‌డుస్తున్నాం. వారంతా అనేక ప్రాంతాలు సంచ‌రించారు. ఆనాడు ఇపుడున్న వ‌స‌తులు, వ‌న‌రులు లేవు.  అయినా వారు తమ ప‌రిధుల్లో చేత‌నైనంత పాటుప‌డ్డారు. ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం. సెప్టెంబ‌ర్ 5 స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ చేసిన కృషికి గుర్తింపుగా టీచ‌ర్స్ డే నిర్వ‌హిస్తున్నాం. వ్యాస మ‌హ‌ర్షి పుట్టిన రోజును టీచ‌ర్స్ డే జ‌రిపితే బావుంటుంది.
ఇపుడు వాన‌లు కురిసే కాలం. స‌న్యాసులే కాదు గృహస్థులు కూడా దీక్ష చేప‌ట్ట‌వ‌చ్చు. ఇత‌ర దేశాల్లో వాన‌లు ఎప్పుడు వ‌స్తాయో ..ఎప్పుడు ఎండ కాస్తుందో తెలీదు. కానీ ప్ర‌కృతి పుణ్య‌మా అంటూ మ‌న‌కు మూడు కాలాలున్నాయి. వానా కాలం, ఎండా కాలం, చ‌లి కాలం ప్ర‌తి కాలం నాలుగు నెల‌లు వుంటుంది. ఆషాఢ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ దాకా . దీక్ష‌లు చేప‌ట్ట‌వ‌చ్చు. ఆహార నియ‌మాలు పాటించాలి. మొద‌టి నెల‌లో ఆకు కూర‌లు. రెండో నెల‌లో పాలు. మూడో నెల‌లో పెరుగు, నాలుగో నెల‌లో ప‌ప్పు ధాన్యాలు  మానేయాలి.
గ‌తంలో ఎన్నో క‌ష్టాలు. ప్ర‌తి దానికి ఇబ్బంది వుండేది. కానీ ఇప్పుడు అలా లేదు. కావాల్సిన‌వి దొరుకుతున్న‌వి. వ‌స‌తులు , వ‌న‌రుల‌కు లెక్క లేదు. బాగా చ‌దువుకోండి. అనారోగ్యానికి మందులున్నాయి. అన్ని రోగాల‌కు స‌రిపడా డాక్ట‌ర్లున్నారు. సౌక‌ర్యాలు క‌లిగిన హాస్పిట‌ల్స్ వున్నాయి. మ‌న‌ల్ని మ‌నం బాగు చేసుకోవ‌డానికి ముందు కృషి చేయండి. మ‌న స్వ‌రూపాన్ని తెలుసుకోగ‌లగాలి. మంచిని వినండి. ప‌ది మందికి మేలు చేకూర్చే ప‌నుల్లో నిమ‌గ్నం కండి. మ‌న‌మంద‌రం వైదికుల‌మే. పుట్టుక‌తో ఏ కులం, ఏ జాతి, ఏ మ‌తానికి చెందిన వారైన‌ప్ప‌టికీ వేద మార్గ‌మే గ‌మ్యం..గ‌మ‌నం కూడా. వెయ్యేళ్ల కింద‌ట శ్రీ రామానుజుల వారు శ్రీ పెరంబదూరులో జ‌న్మించారు. అందరికీ దేవాల‌య ప్ర‌వేశం క‌ల్పించేలా చేశారు. నేడు కొలుస్తున్న తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌రుడిని కూడా ఆయ‌నే అందించారు. అత‌నికి ఆయ‌నే గురువు కూడాను.  మ‌న‌మంతా భ‌గ‌వ‌త్ కుటుంబానికి చెందిన వారము. దివ్య ధామ‌ము ఎదురుగానే విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మ‌రో నాలుగైదు నెల‌ల్లో పూర్తి కానున్న‌ది.
ఆ మ‌హోన్న‌త‌మైన కార్య‌క్ర‌మానికి మీరంద‌రూ రావాలి. మీతో పాటు మీ తోటి వారిని తీసుకు రావాలి. ఈ బృహ‌త్కార్యంలో పాలు పంచు కోవ‌డం దైవానుగ్ర‌హ‌మే. ప్ర‌తి ప్రాంతంలో దీని విశిష్ట‌త గురించి అఖండ జ్యోతిని తీసుకుని స్వాములు బ‌య‌లు దేరుతారు. శ్రీ అహోబిల స్వామి, శ్రీ దేవ‌నాథ స్వామితో పాటు మ‌రికొంద‌రు వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తారు.  ఈ చాతుర్మాస్య దీక్షా కాలంలో ప్ర‌తి  రోజూ 8 గంట‌ల నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు న‌మ్మాళ్వార్లు అందించిన తిరువాయిమొజి భ‌గ‌వ‌త్ విష‌య కాల‌క్షేపం వుంటుంది.  దీనిని స‌ద్వినియోగం చేసుకోండి. జీవితాన్ని చ‌రితాత‌ర్థం చేసుకోండి . ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ అహోబిల స్వామి వారు మాట్లాడుతూ ఎంతో శ్ర‌మ‌కోర్చి శ్రీ రామానుజుల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్నారు. ల‌క్ష మంది భ‌క్తులు ఒక్కొక్క‌రు 20 వేల రూపాయ‌ల చొప్పున ఇవ్వ‌గ‌లిగితే బావుంటుంద‌న్నారు. స్వామి వారి పిలుపును అందుకున్న భ‌క్తులు కొంద‌రు ఈ ప్రాజెక్టు కోసం విరాళం అంద‌జేశారు.  శ్రీ‌మాన్ డాక్ట‌ర్ రంగ‌రామానాజాచార్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

The post Guru Purnima Celebrations at JIVA | HH Chinna Jeeyar Swamiji appeared first on Chinnajeeyar.

Source: Varija News