ఆధునిక కాలంలో రోగుల సంఖ్య రాను రాను పెరుగుతూ వస్తోంది. దీనిని నివారించేందుకు ఎందరో ఎన్నో మార్గాలు అవలంభిస్తున్నారు. ఊహించని రీతిలో ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కలిగించే హోమియో వైద్యం మన పక్కనే ఉన్నా వినియోగించు కోక పోవడం బాధాకరమని శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి రచించిన స్వభావ వైద్యం, స్త్రీ శిశు వైద్యం, ఇంటింటా హోమియో పుస్తకాలను హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పుస్తకాలను ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుకు అందజేశారు. మై హోం సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ కాలానికి సరైన వైద్యం హోమియో వైద్యమేనని చినజీయర్ స్వామీజీ చెప్పారు. రోగిని నిదానంగా పరిశీలించి సరైన ఔషధాన్ని ఎంపిక చేసి ఇవ్వగలిగితే హోమియో వైద్యాన్ని మించింది ఉండదన్నారు. ఇటీవలి కాలంలో ఈ వైద్య విధానానికి ఆదరణ పెరుగుతూ వస్తోందన్నారు. ప్రస్తుతం తినే తిండి, జీవన శైలి అనారోగ్యాలను తెచ్చి పెట్టేలా ఉన్నాయని హెచ్చరించారు. వీటి నుంచి పూర్తిగా బయట పడాలంటే హోమియో వైద్యమే చక్కటి పరిష్కార మార్గమని స్వామీజీ సూచించారు. వైద్యులు ఏదో మొక్కుబడిగా వైద్యం చేస్తున్నారే తప్పా సక్రమంగా పరీక్షిస్తే సగం రోగం మాయమై పోతుందన్నారు. రోగాన్ని ..తీవ్రతను గుర్తించి మందులు ఇవ్వగలిగితే రోగులు కోలుకునే పరిస్తితి ఉంటుందన్నారు. నేటి డాక్టర్లకు పరీక్షించే ఓపిక లేకుండా పోతోంది. హోమియో వైద్యం పై మరింత ఆసక్తి కలిగిన వారు పరిశోధనలు చేస్తే ఎక్కువ మందికి మేలు చేకూరే అవకాశం ఉందన్నారు చినజీయర్. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు లేకుండానే రామోజీరావు, పావులూరి కృష్ణమూర్తిలు హోమియో వైద్యం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు. అక్కరకు వచ్చే అంశాలను ఎప్పటికప్పుడు అందజేస్తే సమాజం కొంత మేరకైనా అందుకుంటుందన్నారు. పావులూరిని ఆధునిక హానిమేన్ గా స్వామీజీ అభివర్ణించారు. చక్కటి వివరాలతో రూపొందించిన ఈ పుస్తకాలను ఇంగ్లీష్, హిందీ, తదితర భాషల్లోకి అనువదించి ప్రచురించాలని సూచించారు. ప్రాణం, మనస్సు, దేహాలను మూడింటిని గమనంలోకి తీసుకునే హోమియో వైద్యం అత్యాధునిక చికిత్స విధానంగా పేర్కొన్నారు. ఈ వైద్యాన్ని మారుమూల పల్లెల్లోకి తీసుకు వెళ్లాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాలను రాయడం జరిగిందన్నారు పావులూరి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే దీనికి అధిక ప్రాచుర్యం ఉందని తెలిపారు.
The post హోమియో వైద్యం మేలైనది – శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామీజీ appeared first on Chinnajeeyar.
Source: Varija News